Telugu Translation of “The Golden Bird” for IML Day Drive

By Bh. Kameswara Rao

All entries to our IML Day Drive are licensed under CC BY 3.0

బంగారు చిలక

అనగనగా… అంగ వంగ కళింగ కాశ్మీర నేపాళ భూపాల చోళ మగథ మాధవ ఆంధ్ర మధ్య దేశంలో…

మణిద్వీప మనే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు పేరు సనాతనుడు. అతనికి ఒక అందమైన తోట ఉంది. ఆ తోటలో బంగారు జామపళ్ళు కాసే ఒక చెట్టుంది. అది కాసే జామపళ్ళని రోజూ లెక్కపెట్టేవారు. అంతలో ఒక విచిత్రం జరిగింది. ఆ పళ్ళు పండి పక్వానికి వస్తున్నాయనగా,  రాత్రికి రాత్రి  ఒకో పండు చొప్పున రోజూ మాయమై పోతున్నాయి. ఇది చూసి రాజుగారికి చాలా కోపం వచ్చింది. తోటమాలిని పిలిచి రాత్రంతా జాగ్రత్తగా కాపలా కాయమని ఆజ్ఞాపించాడు. ఆ తోటమాలికి కాలపర్ణుడు, తామ్రపర్ణుడు, శ్వేతపర్ణుడు అని ముగ్గురు కొడుకులున్నారు. పెద్దకొడుకు కాలపర్ణుడిని పిలిచి ఆ రాత్రి తోటకి కాపాలా ఉండమని చెప్పాడు తోటమాలి. కాలపర్ణుడికి అసలే నిద్ర ఎక్కువ. కాని తండ్రి మాట విని తోట కాపలాకి వెళ్ళాడు. రాత్రి పన్నెండు దాకా కష్టపడి ఎలాగో అలా నిద్ర ఆపుకున్నాడు కాని, ఆ తర్వాత అతడికి మైకం కమ్మేసింది. ఇంకేముంది! పొద్దున్న లేచి చూసేసరికి మళ్ళీ ఒక పండు మాయం. మర్నాడు తోటమాలి తన రెండో కొడుకైన తామ్రపర్ణుడిని వెళ్ళమన్నాడు. తామ్రపర్ణుడికి గర్వం ఎక్కువ. “ఓ! నేనీ రాత్రి వెళ్ళి అసలు సంగతి తేల్చేస్తాను.” అని బీరాలు పలికి తోటకి బయలుదేరాడు. కాని అతడు కూడా రాత్రి పన్నెండయ్యేసరికి నిద్రమత్తులోకి ఒరిగిపోయాడు. మర్నాడు మళ్ళీ మామూలే. మరో పండు మాయమైపోయింది. మూడో రాత్రి చిన్నవాడైన శ్వేతపర్ణుడు తాను వెళ్ళి కాపలా ఉంటానన్నాడు. చిన్నవాడు కదా, వాడికేమైనా ఆపద కలుగుతుందేమోనని తోటమాలి ముందు తటపటాయించాడు, కాని చివరికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి శ్వేతపర్ణుడు తోటకి కాపాలాకి వెళ్ళాడు. అర్ధరాత్రి పన్నెండయ్యింది. శ్వేతపర్ణుడు జాగురూకతతో కాపలాకాస్తున్నాడు. అంతలో అతనికి ఆకాశంలో చటచటమన్న శబ్దం వినిపించింది. ఎక్కణ్ణుంచో ఎగురుకుంటూ ఒక చిలక వచ్చింది. అది బంగారు చిలక! కొమ్మమీద కూర్చుని ఒక పండుని తన ముక్కుతో తుంచ సాగింది. వెంటనే శ్వేతపర్ణుడు తన దగ్గరున్న విల్లు ఎక్కుపెట్టి దానిపైకి బాణం వేసాడు. కానీ ఆ బాణం చిలకని ఏమీ చెయ్యలేదు. బంగారు జాంపండుతో సహా ఆ బంగారు చిలక తుఱ్ఱున ఎగిరిపోయింది. దాని తోకనుంచి ఒక బంగారు యీక మాత్రం రాలి కిందపడింది. మర్నాడు పొద్దున్న ఆ బంగారు యీకని రాజసభలో రాజుగారి దగ్గరకి తీసుకువెళ్ళారు. దాన్ని పరిశీలించిన సభ్యులు, ఆ ఒక్క యీక, తమ రాజ్యంలో ఉన్న సమస్త సంపద కన్నా చాలా ఎక్కువ విలువ చేస్తుందని తేల్చారు. అయినా సరే రాజుగారు, “ఈ ఒక్క యీక నాకు పనికిరాదు. ఆ బంగారు చిలకే కావాలి” అని పట్టుబట్టారు.

బంగారు చిలకని వెతకడానికి కాలపర్ణుడు ప్రయాణమయ్యాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికొక చిన్న అడవి కనిపించింది. ఆ అడవి మొదట్లో ఒక నక్క కూర్చుని ఉంది. దాన్ని చంపడానికి తన విల్లు ఎక్కుపెట్టాడు కాలపర్ణుడు. అప్పుడా నక్క కాలపర్ణుడితో యిలా అంది – “ఆగాగు! నన్ను చంపకు. నా పేరు సుబుద్ధి. నేను నీకు కావలసిన సమాచారాన్ని అందించి నీకు మేలు చేస్తాను. నువ్వే పని మీద వెళుతున్నావో నాకు తెలుసు. బంగారు చిలక కోసమే కదా. నువ్వు తిన్నగా యీ దారిలో వెళితే సాయంత్రానికల్లా ఒక చిన్న గ్రామాన్ని చేరుకుంటావు. అక్కడ నీకు దారికి రెండు వైపులా రెండు సత్రాలు కనిపిస్తాయి. ఒకటి చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కాని అందులోకి వెళ్ళకు. దాని ఎదురుగ్గా పాడుపడినట్టు కనిపించే సత్రంలోకి వెళ్ళి, రాత్రి అక్కడే గడుపు. అప్పుడు నువ్వు కోరుకున్నది నీకు దొరుకుతుంది.” నక్క చెప్పిన విషయమంతా విని కాలపర్ణుడు సంతోషించాడు. కానీ ఆ రహస్యం మరెవ్వరికీ చెప్పకుండా సుబుద్ధిని చంపెయ్యాలన్న దుర్బుద్ధితో, ఎక్కుపెట్టిన బాణాన్ని దాని మీదకి వదిలిపెట్టాడు. కాని నక్క దాన్నుంచి తప్పించుకొని, తన తోకని పైకెత్తి అడవకిలోకి చరచరా పరిగెత్తి పారిపోయింది. కాలపర్ణుడు సుబుద్ధి చెప్పిన దారిన వెళ్ళి సాయంత్రానికల్లా సత్రాలున్న చోటికి చేరుకున్నాడు. అందంగా ఉన్న సత్రంలో చాలా మంది జనాలు ఆడుతూ పాడుతూ ఖుషీ చేస్తూ కనిపించారు. అది చూసేసరికల్లా కాలపర్ణుడికి సుబుద్ధి మాటలు మరుపుకి వచ్చాయి. తిన్నగా ఆ సత్రంలోకే దూరిపోయాడు. అందరితో పాటు హాయిగా తింటూ తాగుతూ, బంగారు చిలక గురించి, తన ఊరు గురించి, వచ్చిన పని గురించి పూర్తిగా మర్చిపోయాడు.

కొంత కాలం గడిచింది. పెద్దకొడుకు తిరిగి రాలేదు సరికదా అతడి ఆచూకీ కూడా తెలియలేదు. దానితో అతడినీ, బంగారు చిలకనీ వెతకడానికి రెండోవాడైన తామ్రపర్ణుడు బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక అతడికి కూడా అడవి, అడవి ముందర సుబుద్ధి కనిపించారు. తామ్రపర్ణి కూడా దాన్ని చంపడానికి బాణం ఎక్కుపెట్టాడు. కాలపర్ణుడికి చెప్పిందే మళ్ళీ యితడికి కూడా చెప్పింది నక్క. కానీ దాని మాటలు తామ్రపర్ణుడు ఖాతరు చెయ్యలేదు. నక్క మాట ఎవరు నమ్ముతారని చెప్పి అతడుకూడా దాన్ని చంపబోయాడు. నక్క తప్పించుకు పారిపోయింది. సాయంత్రం రెండు సత్రాలున్న చోటుకి చేరుకున్నాడు తామ్రపర్ణుడు. అందంగా కనిపిస్తున్న సత్రంలో జల్సా చేస్తూ అన్నగారు కనిపించారు. ఇహనేం. అతడుకూడా ఆ సత్రంలోకే వెళ్ళి, తను వచ్చిన సంగతి మరిచిపోయి తానూ మజాలో మునిగిపోయాడు.

మరికొంత కాలం గడిచింది. తోటమాలి ఇద్దరు కొడుకులూ తిరిగిరాలేదు. ఆఖరివాడైన శ్వేతపర్ణుడు, తాను కూడా  బంగారు చిలకని వెతకడానికి వెళతానన్నాడు. కాని అతనంటే తోటమాలికి చాలా ఆప్యాయం. ఏ ఆపదో సంభవించి, అతను కూడా వెళ్ళి తిరిగిరాడేమో అన్న భయంతో పంపడానికి ఒప్పుకోలేదు. కాని కొడుకు మరీమరీ చెప్పడంతో ఎట్టకేలకు అంగీకరించాడు. శ్వేతపర్ణుడు బయలుదేరి మళ్ళీ ఆ అడవి దగ్గరకి వచ్చి సుబుద్ధిని కలిసాడు. మళ్ళీ అన్నలిద్దరికీ చెప్పిన విషయాన్నే అతనికీ చెప్పింది నక్క. అన్నల్లాగ ఆ నక్కని చంపడానికి ప్రయత్నించకుండా, శ్వేతపర్ణుడు దానికెంతో కృతజ్ఞతలు చెప్పాడు. అతని సత్ప్రవర్తనకి సంతోషించిన నక్క, “నా తోక మీదెక్కి కూర్చో. నిన్నా ప్రదేశానికి త్వరగా చేరుస్తాను” అని చెప్పింది. శ్వేతపర్ణుడు దాని తోకనెక్కి కూర్చున్నాడు. సుబుద్ధి ఝామ్మని  ఆఘమేఘాల మీద పరిగెత్తి గ్రామానికి చేరుకుంది.

సుబుద్ధి చెప్పినట్టే శ్వేతపర్ణుడు పాడుపడ్డ సత్రంలోనే ఆ రాత్రి బస చేసాడు. పొద్దున్న లేచి తన ప్రయాణానికి సిద్ధమవుతున్న శ్వేతపర్ణుడిని మళ్ళీ సుబుద్ధి కలుసుకుంది. మళ్ళీ అతనికి మరో మంచి సమాచారం అందించింది. “ఇక్కడ నుండి యిలా తిన్నగా వెళితే, ఖేచరీపురమనే రాజ్యం వస్తుంది. అక్కడొక పెద్ద కోట ఉంటుంది. ఆ కోటముందు చాలామంది సైనికులు గుఱ్ఱు పెడుతూ నిద్రపోతూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోకు. తిన్నగా కోటలోకి వెళ్ళు. ఎదురుగా ఒక గది ఉంటుంది. ఆ గదిలోనే నీకు కావలసిన బంగారు చిలక ఒక చెక్క పంజరంలో ఉంటుంది. దానికి దగ్గరలోనే మరొక అందమైన బంగారు పంజరముంటుంది. కాని నువ్వా చిలకని చెక్క పంజరంలోంచి తీసి బంగారు పంజరంలో పెట్టే ప్రయత్నం చెయ్యకు. చేసావో తర్వాత విచారించవలసి వస్తుంది” అని హెచ్చరికగా చెప్పింది. అలా చెప్పి మళ్ళీ తన తోకని తిన్నగా చాపి శ్వేతపర్ణుడిని ఎక్కించుకొని ఝామ్మని ఆఘమేఘాల మీద పరిగెత్తి అతన్ని ఖేచరీపురం చేర్చింది.

అక్కడ సుబుద్ధి చెప్పినట్టే పెద్ద కోట, దాని ముందు సైనికులూ కనిపించారు. శ్వేతపర్ణుడు తిన్నగా కోటలోకి వెళ్ళి ఆ గదిని చేరుకున్నాడు. అక్కడ వేలాడుతున్న చెక్క పంజరంలో బంగారు చిలక కనిపించింది. దాని కింద, అది తీసుకువచ్చిన బంగారు పళ్ళు కూడా అక్కడే ఉన్నాయి. ఆ పక్కగా మిలమిలా మెరుస్తూ బంగారు పంజరం కనిపించింది. అది చూసి శ్వేతపర్ణుడు, “ఇంత సుందరమైన యీ పక్షిని యిలా చెక్క పంజరంలో పెట్టి తీసుకువెళ్ళడం చూస్తే ఎవరైనా నవ్విపొతారు.” అని అనుకొని, పక్షిని ఆ పంజరంలోంచి తీసి, బంగారు పంజరంలో పెట్టాడు. వెంటనే ఆ పక్షి గట్టిగా కీచుకీచుమంటూ అరవడం మొదలుపెట్టింది. దాంతో బయటనున్న సైనికులందరూ లేచి వచ్చి శ్వేతపర్ణుడిని బంధించి ఆ ఖేచరీపురం రాజు దగ్గరకి తీసుకువెళ్ళారు. మరునాడు సభ జరిపి, శ్వేతపర్ణుడు చెప్పిందంతా విని అతనికి మరణశిక్ష విధించారు. అయితే అతనికొక అవకాశం ఇచ్చారు. వసుమతీపురమనే రాజ్యంలో వాయువేగ మనోవేగాలతో పరుగెత్త గలిగే బంగారు గుఱ్ఱం ఉంది. దాన్ని తెచ్చిస్తే, శ్వేతపర్ణుడు బంగారు చిలకని తీసుకొని వెళ్ళిపోవచ్చు.

పాపం దిగాలుగా వగరుస్తూ, వసుమతీపురం ఎక్కడుందో వెతకడానికి ప్రయాణమయ్యాడు శ్వేతపర్ణుడు. ఎక్కణ్ణుంచి వచ్చిందో సుబుద్ధి మళ్ళీ అతనికి ఎదురయింది. “నా మాట వినకపోవడం వల్ల యిప్పుడేమయిందో చూసావా! అయినా నువ్వు మంచివాడివి కాబట్టి నీకు మళ్ళీ సాయం చేస్తాను. బంగారు గుఱ్ఱం ఎలా సంపాదించాలో చెపుతాను విను. ఇలా యీ దోవన తిన్నగా వెళితే వసుమతీపురం వస్తుంది. అక్కడొక కోట ఉంటుంది. ఆ కోటలోని గుఱ్ఱపుసాలలో బంగారు గుఱ్ఱం ఉంటుంది. దాని పక్కనే గుఱ్ఱాలకాపరి గుఱ్ఱు పెడుతూ నిద్రపోయి ఉంటాడు. మెల్లగా దాని కట్లు విప్పి తీసుకురా. అక్కడే రెండు గుఱ్ఱపు జీన్లు ఉంటాయి. పాతదైపోయిన తోలు జీను ఒకటి, మెరిసే బంగారపు జీను మరొకటి. నువ్వు మాత్రం ఆ బంగారపు జీను జోలికి వెళ్ళకుండా తోలు జీనునే గుఱ్ఱంపై వేసి జాగ్రత్తగా తోలుకు వచ్చేయి”, అని చెప్పింది సుబుద్ధి. మళ్ళీ తన తోక మీద శ్వేతపర్ణుడిని ఎక్కించుకొని, ఝామ్మని ఆఘమేఘాల మీద పరిగెత్తి వసుమతీపురం కోట దగ్గర అతన్ని దించింది.

అనుకున్నట్టే శ్వేతపర్ణుడు గుఱ్ఱపుసాలలోకి వెళ్ళి బంగారు గుఱ్ఱాన్ని తీసుకు రాడానికి సంసిద్ధుడయ్యాడు. కాని అతను గుఱ్ఱాన్ని చూసేసరికి, “పాపం. ఇంత మంచి గుఱ్ఱానికి ఆ పాత తోలు జీను వెయ్యడమేమిటి! దీనికి బంగారు జీనే సరైనది” అని అనుకొని, బంగారపు జీను తియ్యడానికి ప్రయత్నం చేసాడు. కాని నిద్రపోతున్న గుఱ్ఱాలకాపరి యీ బంగారు జీను మీద ఒక చెయ్యి వేసి పడుకొని ఉన్నాడు. శ్వేతపర్ణుడు దాన్ని తియ్యడానికి ప్రయత్నించిన క్షణంలో అతనికి మెలకువ వచ్చి గట్టిగా కేకలు పెట్టాడు. ఆ అరుపులకి రాజభటులు వచ్చి శ్వేతపర్ణుడిని బందీ చేసి వసుమతీపురం రాజు దగ్గరకి తీసుకువెళ్ళారు. మర్నాడు ఉదయం సభ జరిపి మళ్ళీ శ్వేతపర్ణుడికి మరణ శిక్ష వేసారు. ఈ రాజుగారు కూడా అతనికి మరో అవకాశం యిచ్చారు. భోగవతీపుర రాజ్యం రాజకుమారి ఆనందినిని తెచ్చి యిస్తే, అతను బంగారు గుఱ్ఱాన్ని తీసుకుపోవచ్చునని షరతు.

మళ్ళీ విచారంగా, భోగవతీపురానికి దారి వెతుక్కుంటూ బయలుదేరాడు శ్వేతపర్ణుడు. మళ్ళీ సుబుద్ధి ప్రత్యక్షమై, “నా మాట వినలేదేం? వినుంటే హాయిగా గుఱ్ఱాన్నీ పక్షినీ కూడా సంపాదించేవాడివి. సరే, ఇంకా నీకు సహాయం చెయ్య బుద్ధి వేస్తోంది. రాజకుమార్తెను సంపాదించే మార్గం చెపుతాను విను. ఇలా యిటువైపు తిన్నగా వెళితే సాయంత్రానికల్లా భోగవతీపురం కోట చేరుకుంటావు. ఆ కోటలోని రాజకుమార్తె సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి స్నానానికి బయలుదేరుతుంది. అలా వెళుతున్న సమయంలో నువ్వు వెళ్ళి ఆమెని అమాంతం ముద్దు పెట్టుకో. అప్పుడామె నీకు వశమై నీతో కూడా వస్తుంది. కాని ఒక్కటి మాత్రం జాగ్రత్త సుమా! ఎట్టి పరిస్థితులలోనూ వచ్చేటప్పుడు ఆమె తలిదండ్రుల దగ్గర సెలవు తీసుకోడానికి వెళ్ళవద్దు.” అని చెప్పి మళ్ళీ తన తోక జాపింది. మళ్ళీ ఝామ్మని ఆఘమేఘాల మీద పరిగెత్తిపోయి సాయంత్రానికల్లా శ్వేతపర్ణుడిని భోగవతీపురం కోట దగ్గరకి చేర్చింది.

నక్క చెప్పినట్టే కోటలోకి ప్రవేశించి, అర్ధరాత్రి పన్నెండు గంటలకి స్నానానికి బయలుదేరిన ఆనందినిని ముద్దుపెట్టుకున్నాడు శ్వేతపర్ణుడు. నక్క చెప్పినట్టే ఆమె శ్వేతపర్ణుడికి పూర్తిగా వశమయ్యింది. అతనితో వెళ్ళడానికి అంగీకరించింది. కాని వెళ్ళేముందు తన తల్లిదండ్రులకి వీడ్కోలు చెప్పి వస్తానని కన్నీళ్ళతో ప్రాధేయపడింది. ముందు శ్వేతపర్ణుడు ససేమిరా అన్నాడు. కాని రాకుమార్తె అతని కాళ్ళమీద పడి ఏడ్చేసరికి శ్వేతపర్ణుడి గుండె కరిగింది. చివరికి ఒప్పుకోక తప్పలేదు. వాళ్ళు రాజు దగ్గరకి వెళ్ళేసరికల్లా రాజభటులు వచ్చి అతన్ని ఖైదు చేసేశారు. శ్వేతపర్ణుడి కథంతా విని రాజు యిలా అన్నాడు – “అదుగో, ఆ కిటికీలోంచి చూడు. ఎదురుగ్గా ఒక కొండ ఉంది చూసావా! అది నా దృష్టికి అడ్డు తగులుతోంది. ఎనిమిది రోజుల్లో దాన్ని తవ్విపారెయ్య గలిగితే, నా కుమార్తెని నీకిస్తాను. లేదంటే నీకు మరణం తప్పదు!”. ఇక చేసేదేముంది! కొండని తవ్వడం మొదలుపెట్టాడు శ్వేతపర్ణుడు. అదేమైనా అలాంటిలాంటి కొండా! మేరుపర్వతమంత పెద్దది! అయినా పట్టువదలక తవ్వసాగాడు. రాత్రనకా పగలనకా అలా ఏడు రోజులు తవ్వాడు. అబ్బే! అయినా అది ఏమాత్రం తరగలేదు. ఎనిమిదో రోజు మళ్ళీ సుబుద్ధి అతని దగ్గరకి వచ్చింది. శ్వేతపర్ణుడి పట్టుదలకి మెచ్చుకొని, “కష్టపడింది చాలు. నువ్వెళ్ళి విశ్రమించు. నేను నీ పని చేసి పెడతాను” అని చెప్పింది. మర్నాడు ఉదయం శ్వేతపర్ణుడు లేచి చూసేసరికల్లా కొండ మాయం! ఆనందంగా రాజు దగ్గరకి వెళ్ళి విషయం చెప్పాడు. రాజు అన్నమాట ప్రకారం రాకుమార్తెని యిచ్చి పంపించాడు.

శ్వేతపర్ణుడు తిరుగుప్రయాణం కట్టాడు. సుబుద్ధి మళ్ళీ అతనికి ఎదురయింది. “మనం రాకుమార్తెని, గుఱ్ఱాన్ని, పక్షిని కూడా సంపాదించే ఉపాయం ఉంది”, అని చెప్పింది. “ఆ! ఏమిటది?” అని ఆశ్చర్యపోతూ అడిగాడు శ్వేతపర్ణుడు. “చెపుతా విను. నువ్వు వసుమతీపురం రాజు దగ్గరకి వెళ్ళి రాకుమార్తెని చూపించు. ఆ రాజు చాలా సంతోషించి, బంగారు గుఱ్ఱాన్ని తెచ్చి యిస్తాడు. ఆ గుఱ్ఱాన్ని ఎక్కి అందరికీ వీడ్కోలిస్తున్నట్టుగా అక్కడున్న ఒక్కొక్కరితో చెయ్యి కలుపు. చివరిగా రాకుమార్తె దగ్గరకి వచ్చి, ఆమెతో కూడా చెయ్యి కలిపినట్టు కలిపి, ఒక్క ఉదుటన ఆమెనెత్తి గుఱ్ఱం మీద కూర్చోబెట్టుకొని, రాకుమార్తెతో సహా ఉడాయించు”, అని ఉపాయం ఉపదేశించింది సుబుద్ధి.

సుబుద్ధి చెప్పినట్టే చేసి, బంగారు గుఱ్ఱాన్నీ రాకుమార్తెనీ కూడా తీసుకుని వచ్చాడు శ్వేతపర్ణుడు. అప్పుడింక ఖేచరీపురం బయలుదేరారు. సుబుద్ధి మళ్ళీ ఉపాయం చెప్పింది. “మనం కోట దగ్గరకి చేరుకున్నాక, నేను రాకుమార్తెతో బయటన ఉంటాను. నువ్వు గుఱ్ఱంపై సవారీ చేస్తూ రాజు దగ్గరకి వెళ్ళు. బంగారు గుఱ్ఱాన్ని చూసిన రాజు చాలా సంతోషించి బంగారు చిలకని తెస్తాడు. కాని నువ్వు గుఱ్ఱం దిగకు. అది నిజమైన బంగారు చిలకో కాదో చూస్తానని చెప్పి దాన్ని నీ చేతిలోకి తీసుకో. అది నీ చేతికందగానే మళ్ళీ గుఱ్ఱాన్ని పరుగుతీయించు.”

సరిగ్గా సుబుద్ధి చెప్పినట్టే చేసి చిలకని కూడా సంపాదించాడు శ్వేతపర్ణుడు. చిలకని పట్టుకొని, ఆనందినిని ఎక్కించుకొని, గుఱ్ఱం మీద తన రాజ్యానికి బయలుదేరాడు. తోవలో ఒక పెద్ద అడవి వచ్చింది. అప్పుడు సుబుద్ధి మళ్ళీ వచ్చి, “నీకింత సాయం చేసానుకదా. నాదొక కోరిక తీర్చు. దయచేసి నా తలా పాదాలు నరికేసి నన్ను చంపెయ్యి” అని శ్వేతపర్ణుడిని కోరింది. కాని అందుకా యువకుడు ససేమిరా ఒప్పుకోలేదు. “నాకింత ఉపకారం చేసిన నిన్ను చంపడానికి నాకు చేతులెలా వస్తాయి” అన్నాడు. అప్పుడా నక్క, “సరే పోనీ! నీకు రెండు జాగ్రత్తలు చెపుతాను. తప్పక గుర్తుంచుకో. ఒకటి – ఉరిశిక్షనుండి ఎవ్వరినీ రక్షించకు. రెండు – ఏ నది ఒడ్డునా కూర్చోకు”, అని హెచ్చరించి వెళ్ళిపోయింది.

శ్వేతపర్ణుడు తన తిరుగు ప్రయాణం కొనసాగించి రెండు సత్రాలున్న గ్రామానికి వచ్చాడు. అక్కడంతా ఏదో గోలగా గొడవగా ఉంది. సంగతేమిటని అడిగితే, “ఇద్దరు దోపిడీ దొంగలని ఉరి తీస్తున్నారు” అని చెప్పారు జనాలు. దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరూ తన అన్నలే! అన్నల్ని ఉరితీస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలడు! “వాళ్ళని రక్షించే మార్గం లేదా?” అని అడిగాడు శ్వేతపర్ణుడు. వాళ్ళు దోచుకున్న సొమ్మంతా ఇచ్చేస్తే వాళ్ళని వదిలేస్తామన్నారు ప్రజలు. సరేనని తన దగ్గరున్న డబ్బులిచ్చి వాళ్ళని విడిపించాడు. అందరూ కలిసి ఇంటికి ప్రయాణం కట్టారు.

తోవలో నక్కని మొదటిసారి కలిసిన అడవి దగ్గరకి వచ్చారు. “మాకు ఆకలిగా అలసటగా ఉంది. ఇక్కడ పక్కనే ఉన్న నది ఒడ్డున కూర్చొని, ఏదైనా తిని, కాస్త విశ్రమిద్దాం” అన్నారు అన్నలిద్దరూ. నక్క చెప్పిన హెచ్చరిక మరిచిపోయి శ్వేతపర్ణుడు సరేనన్నాడు. అందరూ నది ఒడ్డుకి వెళ్ళి కూర్చున్నారు. శ్వేతపర్ణుడు కాస్త ఏమరుపాటుగా ఉన్న సమయం చూసి అన్నలిద్దరూ వెనకనుండి వెళ్ళి అతన్ని నదిలోకి తోసేశారు. బంగారు చిలకని, గుఱ్ఱాన్ని, రాకుమార్తెని తీసుకొని తమ రాజ్యానికి చక్కాపోయారు. రాజుగారికి బంగారు చిలకనిచ్చి, తమే కష్టపడి ఆ చిలకనీ, గుఱ్ఱాన్నీ, రాకుమార్తెని సంపాదించామని బొంకులు పలికారు. అందరూ సంతోషించి సంబరాలు చేసుకున్నారు. కాని గుఱ్ఱం ఏమీ తినడం మానేసింది. చిలక ఉలుకూపలుకూ లేకుండా ఉండిపోయింది. రాకుమార్తె దిగులుగా ఏడుస్తూ ఉంటోంది.

ఇక్కడ శ్వేతపర్ణుడు నది అడుక్కి పడిపోయాడు. కాని అదృష్టవశాత్తూ నది దాదాపుగా ఎండిపోయి ఉంది. కాబట్టి అతను మునిగిపోలేదు. కాని ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి. నది బాగా లోతుగా ఉండడంతో అతను బయటకి రాలేకపోయాడు. అప్పుడు మళ్ళీ అతని పాత నేస్తం సుబుద్ధి అక్కడికి వచ్చింది. తన హెచ్చరికని పాటించనందుకు శ్వేతపర్ణుడిని మందలించి, “అయినా, నిన్నీ పరిస్థితిలో వదిలిపెట్టి ఎలా పోగలను! ఇదిగో నా తోక పట్టుకో” అని తన తోకని పొడుగ్గా పెంచి అతనికి అందించి, దానితో అతన్ని లాగి బయటకి తీసింది. “నువ్విలా నీ రాజ్యానికి వెళితే నీ అన్నలు నిన్ను బతకనివ్వరు. అంచేత మారు వేషంలో వెళ్ళి రాజుగారికి అసలు సంగతి చెప్పు” అని సలహా యిచ్చింది. శ్వేతపర్ణుడు ఒక పేదవాని వేషం వేసుకొని రాజుగారి కోటలోకి ప్రవేశించాడు. అతను రాగానే గుఱ్ఱం లేచి గడ్డి మేయడం మొదలుపెట్టింది. చిలక తీయని పలుకులు మాట్లాడ్డం మొదలుపెట్టింది. రాకుమార్తె ఏడుపాపేసింది. ఇదంతా ఆశ్చర్యపోయి చూస్తున్న రాజుగారి దగ్గరకి వెళ్ళి శ్వేతపర్ణుడు జరిగిన సంగతంతా చెప్పాడు. అసలు విషయం తెలుసుకున్న రాజు అన్నలిద్దరినీ ఖైదు చేసి వాళ్ళకి తగిన శిక్ష వేశాడు. శ్వేతపర్ణుడి సాహసానికి, మంచితనానికీ మెచ్చి, తన రాజ్యానికి అతడిని రాజును చేశాడు. రాకుమార్తె ఆనందినిని పెళ్ళి చేసుకొని శ్వేతపర్ణుడు చక్కగా రాజ్యం చేయసాగాడు.

కొత్త దంపతులిద్దరూ ఒక రోజు వాహ్యాళికి అడవి దగ్గరకి వెళ్ళారు. మళ్ళీ అక్కడ సుబుద్ధి కనిపించింది. ఇప్పటికైనా తన తలా పాదాలు నరికి తనని చంపమని వేడుకుంది. దాని బాధ చూసిన శ్వేతపర్ణుడు అఖరికి అది అడిగిన కోరిక తీర్చాడు. వెంటనే ఆ నక్క ఒక గంధర్వునిగా మారిపోయింది. సుబుద్ధి అనే ఆ గంధర్వుడు ఆనందిని అన్నగారే! శాపవశాత్తూ నక్కగా మారిపోయాడు. శాప విమోచనమైన సుబుద్ధి, దంపతులని ఆశీర్వదించి అదృశ్యమైపోయాడు. ఆనందినీ శ్వేతపర్ణులు ఆనందంగా కలకాలం జీవించారు.

కథ కంచికి… మనమింటికి…

2 thoughts on “Telugu Translation of “The Golden Bird” for IML Day Drive”

  1. Very good story, like what I read in Chandamama in good olden days. If we tell the story kids, they immensely pleased and enjoy the story.

Leave a Reply